అమరావతి: మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది. ఇవి కేవలం మహిళలకు కోసం ఉద్దేశించినవి మాత్రమే. స్నానపు గదులు, బేబీ కేర్ రూములు, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, విశ్రాంతి స్థలాలు వంటి అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రాలు.. ముఖ్యంగా గోదావరి పవిత్ర ఒడ్డున సందర్శించే మహిళలకు చాలా అవసరమైన సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు.
చారిత్రక, ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలోని గోదావరి తీరానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాల కోసం వస్తుంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 'స్వచ్ఛ నగరం' లక్ష్యంగా రూ.10 లక్షలతో పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ పింక్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పింక్ టాయిలెట్లను త్వరలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కసరత్తు చేస్తోంది. 2027లో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరాన్ని శాశ్వత ప్రాతిపదికన డెవలప్ చేస్తున్నామని కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు.