పెద్ద హామీనే ఇచ్చిన ఏపీ సీఎం జగన్
Employees Union Leaders Meet With CM Jagan. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. వారి డిమాండ్ల పట్ల సీఎం జగన్ సామరస్యపూర్వకంగా స్పందించారు. ఎంత మంచి చేయడానికి వీలవుతుందో అంత చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్నానని, వాటిపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మూడ్రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఉద్యోగులు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని సీఎం జగన్ హితవు పలికారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉండరాదని.. ప్రతి సమస్యను పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సహా 71 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఇప్పటికే సీఎస్, ఇతర అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు.
దాంతో ఉద్యోగ సంఘాలు నేరుగా సీఎంతోనే మాట్లాడతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యాయి. అంతకు ముందు రోజు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు. ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు.