గుడ్‌న్యూస్‌.. ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on  17 Dec 2024 8:05 PM IST
గుడ్‌న్యూస్‌.. ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. చేప పిల్లల పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని, జనవరి నెలాఖరు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని ప్రజా ప్రతినిధులు చేప పిల్లల పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

మత్స్యకారులకు ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తడంతో తక్షణమే రూ.6.67 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇకనుంచి ప్రతి ఏటా మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీకి అవసరమైన నిధులు ముందుగానే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఇంధనం ధర లీటరుకు సుమారు రూ.10/- ఆదా చేసేందుకు మెరైన్ ఇంధనం అందుబాటులోకి తెస్తున్నామని, ప్రభుత్వ పరిధిలో ఉన్న 54 ఫిష్ సీడ్ పాండ్స్ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన మత్స్య సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కేరళా తరహాలో కేరళ ప్రభుత్వ సహకారంతో కృత్రిమ రీఫ్ లను ఏర్పాటు చేసి తీర ప్రాంతాల్లో మత్స్య సంపద వృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో హార్బర్లు, జెట్టిలు, ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Next Story