తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారంతా తిరుగు పయనమయ్యారు.
By అంజి Published on 13 May 2024 8:15 PM IST
తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారంతా తిరుగు పయనమయ్యారు. దీంతో చౌటుప్పల్ దగ్గరున్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. కాగా శని, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి కిక్కిరిసిపోయిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం.. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 57.42 శాతం పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భయంకరమైన పోలింగ్ జరిగింది. సోమవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 10కి పైగా హింసాత్మక సంఘటనలు పోలింగ్ ప్రక్రియను దెబ్బతీశాయి. రాళ్లు రువ్వడం, చెంపదెబ్బలు కొట్టడం, వాహనాలకు నిప్పంటించడం వరకు హింస రాష్ట్రాన్ని కుదిపేసింది. అదనపు భద్రతా సిబ్బందిని ఉన్నపళంగా రంగంలోకి దించారు. హింసాకాండ కారణంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం పోలీసులతో సహా స్థానిక అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) కార్యకర్తలు రాళ్లదాడులు, భౌతిక దాడులకు పాల్పడ్డారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసు సిబ్బంది జోక్యం చేసుకున్నారు.