Andhrapradesh: పాఠశాల బస్సు బోల్తా.. 8 ఏళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో సోమవారం పాఠశాల బస్సు ప్రమాదానికి గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Aug 2024 6:36 AMAndhrapradesh: పాఠశాల బస్సు బోల్తా.. 8 ఏళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో సోమవారం పాఠశాల బస్సు ప్రమాదానికి గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఓబులవారిపల్లి సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరాయిని ఢీకొనడంతో బస్సు రోడ్డు పక్కన పడిపోయింది.
బస్సు డోర్ దగ్గర కూర్చున్న రెండో తరగతి చదువుతున్న భవిష్య (8) అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఓబులవారిపల్లి నుంచి బయలుదేరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రావణి విద్యానికేతన్ పాఠశాలకు వెళ్తోంది. వాహనంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు డ్రైవర్ బండరాయిని గమనించడంలో విఫలమై, దానిని ఢీకొట్టిన తర్వాత వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాటసారులు విద్యార్థులను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. చాలా మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు మృతురాలి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు. బస్సును పైకి లేపేందుకు క్రేన్‌ను తీసుకొచ్చారు.
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పాఠశాలలకు సరైన భద్రతా నిబంధనలు పాటించకుండా బస్సులు నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు.
మరోవైపు సోమవారం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో పాఠశాల బస్సు ఢీకొని పాదచారి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు వేగంగా ఢీకొట్టింది. గత నెల, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పాఠశాల బస్సును ట్రక్కు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందగా, 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.
కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో జులై 2న పిఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్కూలు బస్సులు రోడ్డు ప్రమాదాలకు అతివేగం, కెపాసిటీ కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణాలుగా కనిపిస్తున్నాయి.