ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 27 May 2024 5:45 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లాలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడి నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కారు నెల్లూరు నుంచి వెల్లూరు వెళ్తోంది. మృతులు శేషయ్య, అతని భార్య జయంతి, వారి బంధువు పద్మమ్మ, కారు డ్రైవర్ సమీర్‌గా గుర్తించారు. వీరంతా నెల్లూరు జిల్లా వాసులు.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొట్టింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలంలో ఈ ప్రమాదం జరిగింది. కారు కోవ్వూరు నుంచి తమిళనాడు వైపు వెళుతోంది. మృతులను స్వామినాథన్ (35), గోపి (31), రాధా ప్రియ (14), రాకేష్ (12)గా గుర్తించారు. క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డుకు అవతలి వైపు బోల్తా పడటంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో వాహనం మొత్తం దగ్ధం కాకముందే అందులోని వారిద్దరూ బయటకు వచ్చారు. వీరికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.