వాలంటీర్లతో ప‌థ‌కాల పంపిణీకి ఈసీ 'నో'

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు

By Medi Samrat  Published on  30 March 2024 2:26 PM GMT
వాలంటీర్లతో ప‌థ‌కాల పంపిణీకి ఈసీ నో

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఎపిటెట్ (APTET) ఫలితాలను వెలువరించ వద్దని.. ఎపిటిఆర్టి (APTRT) పరీక్షలను నిర్వహించవద్దని, వాయిదా వేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాలకు సంబందించిన ఆదేశాలు ఎన్నికల సంఘం నుండి నేడే తమ కార్యాలయనికి అందాయని ఆయన తెలిపారు.

భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఎటు వంటి పథకాలు, పింఛను నగదును పంపిణీ చేయకూడదని, ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర డివైజ్లను వెంటనే సంబందిత జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలను ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు పర్చాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా ఎపిటెట్ (APTET) ఫలితాలను వెలువరించే అంశం మరియు ఎపిటిఆర్టి (APTRT) పరీక్షలను నిర్వహించే అంశానికి సంబందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన ప్రతిపాదనలను భారత ఎన్నికల సంఘం పరిశీలించడం జరిగిందన్నారు. ఈ అంశానికి సంబందించి రాష్ట్రంలో ఎన్నిల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఆ రెండు అంశాలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

Next Story