ఆంధ్రప్రదేశ్‌లో నిన్న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి పోలింగ్‌లో వైసీపీ శ్రేణుల దాడులను ధైర్యంగా ఎదురించిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరితో పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఇది ఆందోళనకర విషయమని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు.
హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రగిరి నియోజకవర్గం కూచివారివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారని సమాచారం. ఈ ఘటనలో 8 మంది గ్రామస్తులకు గాయాలు కాగా 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో వైసీపీ కి చెందిన ఓ కారు దగ్ధం, మరోకారు ధ్వంసమైంది. పరారైన సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసి గ్రామస్తులు.. బైకులను తగులబెట్టారు.