ఏపీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ద్వారకా తిరుమలరావు రాగా.. పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. తన చాంబర్ లో సంతకం చేసి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు శంకబ్రత బాగ్చీ, వినీత్ బ్రిజ్ లాల్, రాజకుమారి తదితరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు మొదటి స్థానంలో ఉండడంతో ఆయనను ఏపీ డీజీపీ పదవి వరించింది.
ద్వారకా తిరుమలరావు గుంటూరుకు చెందిన వారు. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. కృష్ణ నగర్‌లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్‌గా పని చేశారు. 1989లో ఆయన ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ద్వారకా తిరుమలరావు 2021 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు జిల్లా ఏఎస్పీగా, రైల్వే, సీఐడీ, సీబీఐ, ఎస్ఐబీ, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.