ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు గుడ్‌న్యూస్‌.. డ్రోన్ స్టార్ట‌ప్‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కాలు

డ్రోన్ రంగంలో స్టార్ట‌ప్‌లు పెట్ట‌డానికి ముందుకొచ్చే యువ‌త‌కు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రోత్స‌హ‌కాలు ఇస్తుంద‌ని ఈ అవ‌కాశాన్ని యువ‌త అందిపుచ్చుకోవాల‌ని ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్ అన్నారు.

By Medi Samrat  Published on  2 Dec 2024 3:00 PM GMT
ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు గుడ్‌న్యూస్‌.. డ్రోన్ స్టార్ట‌ప్‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కాలు

డ్రోన్ రంగంలో స్టార్ట‌ప్‌లు పెట్ట‌డానికి ముందుకొచ్చే యువ‌త‌కు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రోత్స‌హ‌కాలు ఇస్తుంద‌ని ఈ అవ‌కాశాన్ని యువ‌త అందిపుచ్చుకోవాల‌ని ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్ అన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడలోని ధ‌నేకుల ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో అడ్వాన్స్డ్ అట‌ల్ ఫ్యాక‌ల్టీ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రామం ఆన్ ఏ డీప్ డైవ్ ఇన్‌టూ అటాన‌మ‌స్ వెహిక‌ల్ థియ‌రీ టు ప్రాక్టీస్ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పన్నెండు రోజుల పాటు జ‌రిగే ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వ కార్య‌క‌మ్రంలో ఆయ‌న విద్యార్థుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ రంగం ఒక కీల‌క రంగంగా అభివృద్ధి చెందబ‌తోంద‌న్నారు. మ‌న దేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను డ్రోన్ క్యాపిట‌ల్ గా అభివృద్ధి చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంక‌ల్పించారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే డ్రోన్ రంగంలో ఏపీ ముందుకు వెళుతోంద‌న్నారు. డ్రోన్ త‌యారీ, సేవ‌ల రంగంలో యువ‌త‌కు, సాంకేతిక విద్యార్థుల‌కు అపార‌మైన అవ‌కాశాలున్నాయ‌ని, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ఎదురు చూస్తున్నాయ‌ని, యువ‌త వాటిని అందిపుచ్చుకోవ‌డానికి ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

డ్రోన్స్ త‌యారీ రంగంలో ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌డానికి ముందుకొచ్చే వారికి వారి 20 శాతం మేర రాయితీ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఓర్వ‌క‌ల్లు వ‌ద్ద 300 ఎక‌రాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక డ్రోన్ హ‌బ్‌ను ఏర్పాటు చేయ‌బోతోంద‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా డ్రోన్ రంగంలో, డ్రోన్ల వినియోగంలో అనూహ్య‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని, సాంకేతిక రోజూ కొత్త పుంత‌లు తొక్కుతూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లు మ‌రింత చేరువ‌య్యేలా చూడ‌టంలో డ్రోన్లు కీల‌క‌పాత్ర పోషించ‌బోతున్నాయ‌న్నారు. దీంతో ఈ రంగంలో అవ‌కాశాలు కూడా పుష్క‌లంగా ల‌భించ‌బోతున్నాయ‌ని తెలిపారు. సాంకేతిక విద్యా సంస్థ‌లు కూడా డ్రోన్ రంగంలో వ‌స్తున్న అత్యాధునిక సాంకేతిక ప‌రిణామాల గురించి వివ‌రించాల‌ని కోరారు. ఈ దిశ‌గా విద్యార్థుల‌కు డ్రోన్ల‌పైన త‌ర్ఫీదు ఇవ్వ‌డానికి ముందుకొచ్చే విద్యా సంస్థ‌ల‌కు కావాల్సిన స‌హ‌కారం అందించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ లో డ్రోన్ల‌కు సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు ఏర్పాటు చేస్తున్నామ‌ని, అలాగే డ్రోన్ల సాంత‌కేతిక వినియోగంపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. వీట‌న్నిటినీ యువ‌త‌, సాంకేతిక విద్యార్థులు, సాంకేతిక విద్యాసంస్థ‌లు ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐఐటీ గౌహ‌తి సెంట‌ర్ ఆఫ్ డ్రోన్ టెక్నాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ ప్ర‌దీప్‌, ధ‌నేకుల ఇంజినీరింగ్ క‌ళాశాల ఛైర్మ‌న్ ధ‌నేకుల ర‌వీంద్ర‌నాథ్ ఠాకూర్‌, కార్య‌ద‌ర్శి భ‌వానీ ప్ర‌సాద్‌, ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ర‌వి క‌డియాల త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story