ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వింతగా మారుతోంది. వేసవి కాలం రాకముందే భానుడు భగభగలాడుతున్నాడు. ఇప్పటికే నందిగామ, కర్నూలు వంటి ప్రాంతాల్లో అత్యధికంగా 37°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, తుని, బాపట్ల పరిసరాల్లో సాధారణం కంటే 2 నుండి 3.5 డిగ్రీల మేర ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు ఎండలు, ఇటు అల్పపీడనంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.