Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది
By Knakam Karthik
Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు విజయవాడ వరలక్ష్మీనగర్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకబియ్యం దుర్వినియోగం జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి నాదెండ్ల వివరాల ప్రకారం..సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించబడ్డాయి. ఈ కార్డులలో QR కోడ్ ను కూడా చేర్చారు. రేషన్ తీసుకున్న వెంటనే, కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా, ఈ రోజు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కొత్తవారికి, చిరునామా మార్చిన వారికి ఈ స్మార్ట్ కార్డులిస్తాం. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని CM ఆదేశించారు. అవసరమైన చోట్ల సబ్ డిపోలు ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు.
కాగా రాష్ట్రంలో నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా సోమవారం 9 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
రెండో విడత 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో, మూడో విడత వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో, నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారన్నారు. గ్రామ/వార్డు స్థాయిలో యాప్ ఏర్పాటు చేసామని అంతేకాకుండా డాష్ బోర్డు ద్వారా స్మార్ట్ కార్డు వివరాలు కూడా చూడొచ్చని మంత్రి నాదెండ్ల తెలిపారు.