అమరావతి: న్యూ ఇయర్ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఒక రోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10.50 గంటలకు ఆ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేస్తారు.
మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అటు సీఎం చంద్రబాబు రేపు ఉదయం 10.50 గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుని 11.30 గంటల వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 12.35 గంటల వరకు లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటిస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.