గుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ
వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Dec 2023 7:15 AM ISTగుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ
వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 18న మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఆ రోజున సచివాలయ, ఆరోగ్య సిబ్బందికి సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. 19వ తేదీ నుంచి కొత్త ఫీచర్లతో 1.42 కోట్ల మందికి నూతన కార్డులను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం చికిత్స ఖర్చు రూ.1000 దాటితే పథకం అమలు అవుతుండగా.. దీని కింద 3257 చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
''ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ చేయడం జగనన్న లక్ష్యం. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ.. డేటా మొత్తం ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ ఈవెంట్‌కు సీఎం త్వరలో శ్రీకారం చుడతారు. పకడ్బందీగా క్యాంపులు జరిగేలా చర్యలు చేపట్టాలి. మరిన్ని పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులకు మంత్రి విడదల రజినీ సూచించారు. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని విడుదల రజినీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. సచివాలయాల వారీగా ప్రతి ఒక్కరికీ నూతన కార్డులు అందుతాయని చెప్పారు. కార్డుల జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.