జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్జెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్టు సమాచారం.
కాగా 1-2 ఏళ్ల చిన్నారులకు సగం మాత్ర(200 మి.గ్రా.) ఆపైన 19 ఏళ్ల వరకు మాత్ర(400 మి.గ్రా) ఇవ్వనున్నారు. పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో అవగాహన కల్పించి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మాత్రలు వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
నులి పురుగుల సమస్య వల్ల పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక లక్షణాలు కనిపిస్తాయి. అయితే దీని నివారణకు పరిశుభ్రత ఒక్కటే మార్గం. దీంతో పాటు ప్రభుత్వం పంపిణీ చేసే మాత్రలను తీసుకోవడం వల్ల కూడా నులి పురుగుల సమస్యను నివారించవచ్చు.