నెల్లూరు జనసేనలో వర్గ విబేధాలు
Differences in Nellore Janasena. నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
By M.S.R
నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రకటన చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని అన్నారు. వినోద్ రెడ్డి దీనిపై స్పందించారు. తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు. సిటీలో సుమారు 275 రోజులుగా పవన్ అన్న ప్రజాబాట పేరుతో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఇటీవలే సిటీ నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు మనుక్రాంత్ రెడ్డి. ఈ సమయంలో వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనలో ముగ్గురు నాయకులు తయారయ్యారు. కేతంరెడ్డితో పాటు మనుక్రాంత్ రెడ్డి, కిషోర్ మూడు గ్రూపులుగా విడిపోయారు. పోటాపోటీగా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేతంరెడ్డి గత 275 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మనుక్రాంత్ రెడ్డి కూడా జనం కోసం జనసేన పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. తాము జనంలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ పవన్ స్టిక్కర్లు అతికించామని, అయితే మనుక్రాంత్ రెడ్డి వర్గీయులు అదే స్టిక్కర్ల పై మళ్లీ స్టిక్కర్లు అంటించడం కరెక్ట్ కాదని కేతంరెడ్డి వర్గం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఘర్షణకు దిగారు. ఇది నెల్లూరు జనసేనలో టెన్షన్ కు కారణమైంది. ముగ్గురు నేతలు ఉండడం.. ఎవరి వెనుక వెళ్ళాలో జనసేన కార్యకర్తలకు దిక్కుతోచకపోవడం సమస్యగా మారింది. నాయకుల మధ్య సమన్వయం లోపించడం.. గ్రూపు తగాదాలు జనసేన నాయకత్వానికి కూడా ఇబ్బందిగా మారిపోయాయి.