ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో ఆక్రమణలకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ధీటుగా స్పందించారు. చెరువును ఆక్రమించి గెస్ట్ హౌస్ కట్టారనే ఆరోపణలపై కేతిరెడ్డి స్పందించారు. వాళ్లు డ్రోన్ తో చిత్రీకరించి చూపించేంత వరకు తన గెస్ట్ హౌస్ అంత అందంగా ఉందనే విషయం తనకు కూడా తెలియదని, తాను చెరువును ఆక్రమించుకోలేదని అది సర్వే నెంబర్ 904లో ఉందని చెప్పారు. 1938లో పట్టాలిచ్చిన భూమి అని, తాను ఆక్రమించుకున్నట్టు 24 గంటల్లోపు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే లోకేశ్ పాదయాత్ర ఆపేసి వెళ్లిపోతారా అని సవాల్ విసిరారు. టిప్పర్ లు రాష్ట్ర సరిహద్దులో కనిపిస్తే బెంగళూరుకు వెళ్తున్నాయని అనుకోవచ్చని, ఇసుక రీచ్ నుంచి టిప్పర్ బయటకు వస్తే అది బెంగళూరుకు వెళ్తోందని ఎలా చెపుతారని ప్రశ్నించారు.
పాదయాత్రలో తన ఐడెంటిటీని చూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని, అతని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. లోకేశ్ లాగా తాను కూడా మాట్లాడితే వాళ్ల కుటుంబం మొత్తం బాత్ రూమ్ లో కూర్చొని ఏడుస్తారని అన్నారు. ఎదుటివారి మీద బురద చల్లి బతకాలనేది వాళ్ల నాన్న లోకేశ్ కు నేర్పించారని అన్నారు. తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎలా చెపుతారని.. 2024 అఫిడవిట్ లో చూస్తే తన ఆస్తి ఎంతనేది తెలుస్తుందని అన్నారు.