AP: మహిళలు, బాలికల మిస్సింగ్‌పై డీజీపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్‌కు సంబంధించి గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 27 July 2023 9:59 AM GMTAP: మహిళలు, బాలికల మిస్సింగ్‌పై డీజీపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్‌కు సంబంధించి గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో మహిళలు, బాలికల అదృశ్యంపై కేంద్రం వివరాలు వెల్లడించింది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళల మిస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్టైంది. మహిళల మిస్సింగ్ వ్యవహారాన్ని వాలంటీర్లకు లింక్ చేస్తూ పవన్ విమర్శలు చేశారు. దీనిపై ఇప్పటికీ రాష్ట్రంలో దుమారం కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ నిరాధారంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మహిళల అదృశ్యం నిజమేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే తేల్చేసింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్‌పై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. ఇందులో 2019లో 2186 బాలికలు, 6252 మహిళలు, 2020లో 2374 బాలికలు, 7057 మంది మహిళలు, 2021లో 3358 బాలికలు, 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మహిళలు మిస్సింగ్ కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న సమాచారమే కారణమని పవన్ కల్యాణ్ గతంలో ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించాయి. పవన్ తన దగ్గర సెంట్రల్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఉందని, దాని ప్రకారమే చెబుతున్నానని అన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. ఐబీ పవన్ కళ్యాన్‌కు డేటా ఇలా ఇచ్చిందని కూడా ప్రశ్నించింది.
అయితే ఇప్పుడు కేంద్రం చెబుతున్న డేటా ప్రకారం మూడేళ్లలో దాదాపు 30 వేల మంది అదృశ్యమైనట్టు తేలింది. తాజాగా మహిళల అదృశ్యంపై డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయింది అవాస్తవమని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు నివేదికలు చూసి మాట్లాడాలన్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 26వేల మంది మిస్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదృశ్యం అయిన మహిళలు 2,700 మంది మాత్రమేనని.. వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. మిస్సింగ్ అయిన వారిలో 23, 354 మందిని గుర్తించామని వెల్లడించారు. వివిధ కారణాల రిత్యా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని డీజీపీ చెప్పుకొచ్చారు.