దేవినేని ఉమకు బెయిల్ మంజూరు
Devineni Uma was granted bail by AP High Court.టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 7:15 AM GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరీశీలకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయనపై కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఐదురోజుల క్రితం రాజమండ్రి జైలుకి తరలించారు. కాగా.. తనపై కావాలనే అక్రమంగా కేసులు బనాయించారని దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం న్యాయస్థానం విచారణ చేప్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దేవినేని ఉమాకు బెయిల్ మంజూరవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేవినేని ఉమపై ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరుపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఏ నేరానికి పాల్పడలేదని చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజిక వర్గమో తెలియదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్తులు అటవీ ప్రాంత సమస్యను దేవీనేని ఉమ దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని న్యాయవాది కోర్టుకు వివరించారు. కస్టడి కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతోందని మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. తాజాగా దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం కావాలనే ఉమాపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపుకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ దోపిడీని ప్రశ్నించిన వారిపై కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.