రాజా రెడ్డి రాజ్యాంగం నడిపే జగన్‌మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్‌మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని.. సుప్రీంకోర్టు రాష్ట్ర భవిష్యత్తును తేల్చనుందని వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య కేసుతో తాడేపల్లి ప్యాలెస్ వణుకుతుందని అన్నారు. గంటలు కొద్దీ వాట్సప్‌లో మెసేజ్‌లు, సంభాషణలతో జగన్ రెడ్డి గడిపారని ఆరోపించారు. జగన్ రెడ్డి సంపాదించిన వేల కోట్ల ఆస్తులన్నీ రాష్ట్ర ప్రజలకు పంచుతామన్నారు.
ఖరీఫ్ లో రైతులపై దృష్టి పెట్టాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు ఎలా తొలగించాలి, అనుకూల కొత్త ఓట్లు ఎలా చేర్చాలి.. దొంగ ఓట్లు ఎలా వేయాలి అన్న అంశంపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసులలో జగన్ తప్పించుకున్నా.. వివేకా హత్య కేసులో జగన్ తప్పించుకోలేడని.. దారులన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని సంచలన కామెంట్స్ చేశారు.
మహానాడులో ప్రవేశపెట్టిన పథకాలు టీడీపీకి పూర్వ వైభవం తెస్తాయన్నారు. లోకేష్ చేస్తున్నయువగళం పాదయాత్ర కూడా పార్టీకి ఏనలేని మేలు చేస్తుందన్నారు. త్వరలో టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈసారి విడుదల చేసిన మేనిఫెస్టోలో మరింత ఆశాజనకరమైన పథకాలు ఉంటాయని వెల్లడించారు.