ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : దేవినేని ఉమ
దుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటి ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని
By Medi Samrat Published on 19 Feb 2024 3:56 PM ISTదుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటి ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని సీఎం జగన్‌పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాసే పెన్ను పై చూపించే కెమెరాలపై నీ గుండాలు దాడి చేస్తున్నారంటే ఒకప్పటి బీహార్ గురించి ఇప్పుడు ఏపీ గురించే చెప్పుకుంటున్నారని అన్నారు. విలేకరులపై దాడులు చేసే హీనస్థితికి జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయాడు.. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అంటూ ఖండించారు. ప్రధాన పత్రికలపై దాడి చేస్తున్నారంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని సిద్ధం సభలు పెట్టుకుని తొడలు కట్టుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. నువ్వు చెప్పే లక్షల కోట్లు, ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయి.? శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా.? అని ప్రశ్నించారు. జగన్ నొక్కిన బటన్లలో కోట్ల బొక్కుడు ఉందని ఆరోపించారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవులను తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో శిక్ష పడగానే ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం బహిష్కరిస్తుంది.. నువ్వా మా పెద్దాయన, చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి.. తిరుమల కొండపైకి చంద్రబాబు నాయుడుతో నడిచే దమ్ము ధైర్యం నీకుందా? నువ్వా ఆయన వయసును ఆయన శక్తిసామర్థ్యాలను ప్రశ్నించేది? అని నిలదీశారు.
జగన్ ఒక రాజకీయ వ్యాపారి.. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి నేడు గుద్దులు గుద్దుతున్నాడని ఆరోపించారు. మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి రైతుల పొలాలను లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా జగన్ కు లేదన్నారు. ఈ పెత్తందారీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొడతారని.. ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి 160 అడుగుల లోతు గొయ్యలో పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.