ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్వేది రథం దగ్ధం, దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరీ, రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటననే చోటుచేసుకుంది.
రాజమండ్రి శ్రీరామ్ నగర్ లో ఉన్న గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. స్వామివారి రెండు చేతులను నరికేశారు. రాత్రి సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఉదయం ఆలయం తెరిచిన పూజారులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయంలోని విగ్రహం ధ్వంసం కావడంతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. తరుచుగా విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోని.. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.