మీరు ఏ పార్టీ వైపు ఉన్నా.. నేను మీ వైపు ఉంటాను

‘దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కష్టపడ్డాను.. కలత చెందాను.. ప్రజల వెతలు చూసి ఆవేదన చెంది కన్నీరు కార్చిన రోజులున్నాయి.

By Medi Samrat  Published on  21 Dec 2024 2:16 PM GMT
మీరు ఏ పార్టీ వైపు ఉన్నా.. నేను మీ వైపు ఉంటాను

‘దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కష్టపడ్డాను.. కలత చెందాను.. ప్రజల వెతలు చూసి ఆవేదన చెంది కన్నీరు కార్చిన రోజులున్నాయి. రాజకీయ శత్రువులు అసభ్యంగా ఇంట్లోని వారిని దూషించినా భరించను. ఎన్ని చేసినా.. ఏం చూసినా.. ఎలాంటిది విన్నా సరే నేను బలంగా అనుకున్నది ఒక్కటే.. కనీసం నాలుగు గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించే స్థాయికి వెళ్లాలని అనుకున్నాను. ఈ రోజు మీ అందరి అభిమానం, ఆశీర్వాదంతో వందల గిరిజన గ్రామాలకు రోడ్లు వేసే స్థితిలో పని చేస్తున్నాన’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు త్రికరణశుద్ధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ కోసం.. ఆనంద డోలికల ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తూ గిరిపుత్రుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.

శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామంలో జిల్లా పరిధిలో రూ.105 కోట్లతో ఏజెన్సీ ప్రాంతంలో 100 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, రూ. 23 కోట్లతో 32 కిలోమీటర్ల రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కింద గిరిజన గ్రామాల్లో వంద మంది కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో సులభంగా రోడ్లు వేసుకునేందుకు కేంద్రం తగిన సహాయం చేస్తోంది. ఇది గతంలో 250 కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో మాత్రమే అమలు అయ్యేది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో 100మంది ఉన్నా రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2వేలకు పైగా గిరిజన గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేదు. మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడా చాలా తక్కువ మంది నివసించడంతో జన్ మన్ పథకం అంతగా అక్కరకు రావడం లేదు. దీని కోసం పంచాయతీ రాజ్ నుంచి నిధులు అలాగే ఉపాధి హామీ పథకంలో రోడ్లను వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ను డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ గా ఆవిష్కరించవచ్చన్నారు.

ఈ ప్రాంతానికి వస్తున్న సమయంలో విలేకరులు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీలు లేరని ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. రాజకీయాలు అభివృద్ధికి అడ్డు కాకూడదని నేను భావిస్తాను. మీరు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా మీ కష్టాలు చూస్తే మాత్రం నేను చలించిపోతాను. గిరిజనులకు కష్టాల్లో మేము ఉన్నామనే భరోసా కల్పించడానికి వచ్చాం. రూ. 100 కోట్లతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. గిరిజనుల సమస్యలపై దృష్టిపెడుతున్నామని అక్కడ సౌకర్యాలు పెంచాలని దీనికి ఆర్థికంగా తోడ్పాటు కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారు. మేము మీ కోసం మనసు పెట్టి వచ్చాం.. మీ కోసం నిలబడి ఉన్నాం. నరేగా నుంచి రూ. 72.20 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 33.13 కోట్లు వెచ్చించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు బాగు చేస్తున్నాం. మొత్తం దీనివల్ల 72 గ్రామాలు 4369 మంది గిరిజనులు లబ్ధి పొందుతారు. లబ్ధి పొందేవారు తక్కువే అయినా గిరిజనుల కష్టాలు తీర్చాలని బలంగా సంకల్పించామ‌న్నారు.

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని యువత బలంగా మార్పు కోరుకున్నారు. కూటమికి బలంగా నిలబడ్డారు. దాని ఫలితమే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 6 నెలల్లోనే రోడ్లు వస్తున్నాయి. సర్పంచులు భుజాలు ఎగరేసి మరి తాము గ్రామ ప్రథమ పౌరులం అని బలంగా చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి, నేను - గిరిజన స్థితిగతులు వారి ఆదాయం, ఆరోగ్యం, రోడ్లు ఇతర సౌకర్యాల గురించి చర్చించుకున్నాం. దీని మొత్తానికి రూ. 2,569 కోట్లు ఖర్చు అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే ఆయన మరో మాట లేకుండా దశల వారీగా గిరిజన గ్రామాల్లో సమస్యలు తీరుద్దామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా మొదటగా రూ. 350 కోట్లు ఏడాదికి ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్రం సహకారం కూడా తీసుకొని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి తీసుకొచ్చేలా చూస్తామ‌న్నారు.

Next Story