తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చానని తెలిపారు.
నగర ప్రజల ఆకాంక్షను టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించానని.. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ బి.ఆర్.నాయుడుకి, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామలరావుకి అభినందనలు లెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అని ప్రకటనలో పేర్కొన్నారు.