పిఠాపురం అత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2024 9:29 AM GMTపిఠాపురంలో ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది. బాలిక మేనత్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుంది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో.. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేది. ఈ అమానుష చర్యను సభ్యసమాజం లోని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తాము. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఇదిలావుంటే.. పిఠాపురంకు చెందిన 16ఏళ్ల బాలిక సోమవారం పట్టణంలోని స్టేట్‌బ్యాంకు వైపు వెళ్తుండగా ఆటో నడుపుకొంటూ వచ్చిన ఒక వ్యక్తి, మరో మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. అడ్రస్ చెబుతుండగా బాలికపై మత్తు మందు స్ప్రే చేసి.. కిడ్నాప్ చేసి ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్‌యార్డు వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ బాలికకు బలవంతంగా మద్యం తాగించి సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఎత్తుకుని తీసుకుని వచ్చి ఆటో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా..వారిని ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ చూసి ప్రశ్నించింది. వెంటనే బాలిక బంధువులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తిని, మహిళను పట్టుకుని పోలీసులకు పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.