చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక చిట్లిందని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పుర్రె ఎముక చిట్లడం మూలంగా తీవ్ర సమస్యలు తలెత్తిన విషయం ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టికి వచ్చింది. ఈ ఘటన వివరాలు తెలుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. తరగతి గదిలో అల్లరి చేస్తుందనే కారణంతో స్కూల్ బ్యాగ్ తో విద్యార్థిని తలపై ఉపాధ్యాయుడు కొట్టారని, ప్రస్తుతం ఆ బాలికకు బెంగళూరులో కుటుంబ సభ్యులు వైద్యం చేయించి ఇంటికి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆరు నెలలపాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు వివరించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమైనదని, పాఠశాలల్లో విద్యార్థులను పాతకాలం మాదిరి దండించే విధానాన్ని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. స్కూల్లో అయినా, ఇంట్లో అయినా అల్లరి చేయడం లాంటివి చోటు చేసుకొంటే.. అదుపు చేసేటప్పుడు కూడా పిల్లల మానసిక ధోరణులను ఉపాధ్యాయులు, తల్లితండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.