పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. అధికారులకు ఇంకోసారి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటామని.. కేసులు పెడతామ'ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 5:15 PM ISTవిధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. అధికారులకు ఇంకోసారి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటామని.. కేసులు పెడతామ'ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అధికారులపై ఈగ వాలినా, చిన్న గీతపడినా బెదిరింపులకు దిగినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సప్త సముద్రాలు దాటినా, రిటైర్ అయినా వదిలిపెట్టమని ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తామని తెలిపారు. కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులు ఎవరూ వాళ్ల బెదిరింపులకు బెదిరిపోరన్నారు. 20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని మభ్యపెట్టి గత ప్రభుత్వంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని.. రోడ్డు మీద నిరసనను చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు ఎన్నిసార్లు ఇబ్బందిపెట్టినా బాధ్యతగా వ్యవహరించమని కోరడం తప్ప ఏనాడూ.. అంతు చూస్తామని మాట్లాడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆదివారం గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్మారక స్థూపం వద్ద అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి అమర వీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని గత ముఖ్యమంత్రి అంటున్నారు. డీజీపీని రిటైర్ అయినా వదలం అని అంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. గత ప్రభుత్వంలో పోలీసులతో ఘోర తప్పిదాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. మీరు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడ బిడ్డలకు సంరక్షణ లేదని విమర్శలు చేస్తున్నారు. ఆడ బిడ్డల మీద దాడులు ఎప్పుడు మొదలయ్యాయి? రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్మాదులు ఎందుకు ఇలా పేట్రేగిపోతున్నారు? గత ప్రభుత్వంలో పాలకులు బాధ్యతారాహిత్యంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణిని తిట్టారు. ఇళ్లలోకి వచ్చి బిడ్డలను రేప్ చేస్తామని మాట్లాడారు. పాలించే నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడితే.. క్రిమినల్స్ కి తప్పులు చేసినా పర్వా లేదన్న ధైర్యం వస్తుందన్నారు.
ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తూ ఉంటారు. ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్ గా పరిగణించవద్దు. ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు పెట్టడానికి వెళ్తే అధికారులు సరిగా స్పందించలేదు. ఆ కేసులో తమ బిడ్డ బ్రెయిన్ డెడ్ అయితే అతని తల్లి అవయవాలు దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సమయంలో ప్రాణాలు తీసుకురాలేకపోయినా, మన ప్రవర్తన ఓదార్పునివ్వాలి. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చన్నారు.
ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ది లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా కోల్ కత్తా ప్రభుత్వ ఆసుపత్రి లాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చట్టాల అమలుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. నిర్భయ చట్టం సమయంలో చాలా మంది పార్లమెంటేరియన్లు, న్యాయమూర్తులు కూడా బలంగా మాట్లాడారు. క్రిమినల్స్ కి కులాలు, మతాలు ఉండవు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడి కులాల వెనుక దాక్కుంటామంటే కుదరదు. ఏ కులం అయినా, మతం అయినా తప్పు చేస్తే శిక్షించి తీరాలని ముఖ్యమంత్రికి, డీజీపీకి చెప్పాము. దీంతో పాటు ఆడ బిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టు పక్కల వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్ కమిటీలు రావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీంతోపాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.