వైఎస్ జగన్ రాకకై డిప్యూటీ సీఎం ఎదురుచూపులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదు
By - Medi Samrat |
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలంటూ కోరారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనని, కానీ అది తమ ప్రభుత్వంలో చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) క్యాంపస్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ తెలిపారు. ఈ ముఖ్యమైన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలోనే చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించారు. తనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యమూర్తి ఈ సంస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. సమాజంలో కళలకు సరైన ప్రోత్సాహం లేకపోతే హింస పెరిగే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.