చంద్రబాబు అండ్ కో హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు
By Medi Samrat Published on 1 Nov 2023 8:34 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బెయిల్ గడువు ముగిసే సమయానికి గుండె పోటు వచ్చిందని కూడా డ్రామా స్టార్ట్ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మా భువనేశ్వరి నిజం గెలవాలి అంటే.. నీ తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఏవిధంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడో నువ్వే నిజం చెప్పాలన్నారు.
పదవికాంక్షతో ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెడితే.. చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. నందమూరి తారక రామారావు ఫాలోయింగ్ తో పార్టీని గెలిపించారని.. ఆయన ఫాలోయింగ్ తో గెలిచిన ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుది మోసం కాదా అని ప్రశ్నించారు. ఇవన్నీ నిజమా.. అబద్ధమా.. అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే.. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది చంద్రబాబు.. ఇది న్యాయమా.. అన్యాయమా.. అనేది భువనేశ్వరి చెప్పాలన్నారు. నిజం గెలిచింది కనుకే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ను సీఎం చేశారని అన్నారు. నిజం ఎప్పుడూ గెలవాలని నేను కూడా కోరుకుంటానన్నారు. చంద్రబాబు చరిత్రను నాశనం చేస్తే.. జగన్ చరిత్ర సృష్టించారన్నారు.
న్యాయస్థానాలను మొదటి నుండి చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారని అన్నారు. ప్రస్తుతం న్యాయస్థానాలు కళ్ళు తెరిచాయి కనుకే చంద్రబాబు జైలు జీవితం అనుభవించారు. చంద్రబాబు లాయర్లు ఎవరూ కూడా ఆయన అవినీతి చేయలేదని వాదించలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు బెయిల్ వచ్చింది అంటే ఆయన కంటి ఆపరేషన్ కోసమని మానవతా దృక్పథంతో మాత్రమే బెయిల్ మంజూరు చేశారు కానీ.. ఆయన బయటకు వచ్చి సభలు, సమావేశాలు పెట్టుకోమని కాదన్నారు.