ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతున్నది : ఉప ముఖ్యమంత్రి
Deputy CM Narayana Swamy. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి.
By Medi Samrat Published on 29 Sep 2021 5:25 AM GMT
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం మొదలైంది. ఆ తర్వాత పలువురు వైసీపీ నాయకులు కూడా పవన్ మీద తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అనబోయి.. తమ ముఖ్యమంత్రినే అన్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతున్నది అంటూ నోరు జారారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నోరు జారారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయబోయి జగన్ పైనే వ్యాఖ్యలు చేశారు. జగన్ దాడి చేసేది ఏంటి.. ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజులు రాబోతున్నాయన్నారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. ఆ తర్వాత సిఎం జగన్ గురించి పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటికే ఆయన నోరు జారిన వ్యాఖ్యలు రికార్డు అయిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నారాయణస్వామి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందచేసిన వస్త్రం తో సత్కరించారు.