విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.
By అంజి Published on 9 July 2024 3:45 PM GMTవిద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు
అమరావతి: ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందన్నారు. ప్రజలపై రూ.32,166 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపిందన్నారు. విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు చేసిందన్నారు. అసమర్థ చర్యల వల్ల మొత్తం రూ.1,29,500 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు.
విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉందన్నారు. విద్యుత్ తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. 2014 లో అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్నారు. గత ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసమర్థులు పరిపాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 1998లో తొలిసారి విద్యుత్ సంస్కరణలు అమలు చేశామని, దేశంలోనే మొట్టమొదట రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చిందన్నారు.
విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో విద్యుత్ సరఫరా, పంపిణీపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. తమ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు గ్రాంట్ గా తీసుకొచ్చామని తెలిపారు. తాను తెచ్చిన సంస్కరణల ఫలితాలు వైఎస్ హయాంలో కనిపించాయని పేర్కొన్నారు. 2014-19 లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, తమ హయాంలో ట్రాన్స్ కో, జెన్‌కో కు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు.
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా పవర్ కట్స్ ఉండవని తెలిపారు. ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. లో వోల్టేజ్ సమస్య ఉండదన్నారు. పవర్ ఎప్పుడు కట్ అయ్యింది అనే వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉందన్నారు. అన్నీ మానిటరింగ్ చేయవచ్చని, క్వాలిటీ విద్యుత్ అందిస్తామని, ఒక్క కంప్లైంట్ రాకూడదని అధికారులకు సూచించారు.
వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని సాధ్యమైనంత వరకు గాడిలో పెట్టేందుకు సాయం తీసుకుంటామన్నారు. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తామన్నారు. వైసీపీ హయాంలో గృహ వినియోగదారులపై 45 శాతం ఛార్జీలు పెంచారని, 50 యూనిట్లు వాడిన పేదలపై 100 శాతం ఛార్జీలు పెరిగాయని విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.