మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన ఆర్థిక స్తోమత అంతంతమాత్రమేనని, అందుకే తనకు న్యాయ సహాయం అందించాలని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీని కోరాడు. అలాగే వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలని వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానే కాబట్టి బాధితుడిగా చూడాలని కోరారు.
కృష్ణారెడ్డి అభ్యర్థనను వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు. అదే సమయంలో సీబీఐకి, అప్రూవర్ గా మారిన దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలోనే దస్తగిరి స్పందిస్తూ, తనకు న్యాయ సహాయం అందించాలని అర్థించాడు. సుప్రీంకోర్టులో తన తరఫున న్యాయవాదిని నియమించుకునేంత ఆర్థిక స్తోమత తనకు లేదని దస్తగిరి తెలిపాడు. అందుకే తనకు న్యాయ సహాయం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు.