బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఘన విజయాన్ని అందుకున్నారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ అభ్యర్థి డా.సుధ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి ఆమె 68 వేల 492 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అన్ని రౌండ్లలో కలిపి వైసీపీకి 84,682, బీజేపీకి 16,190, కాంగ్రెస్ కు 5,026 ఓట్లు రాగా.. నోటాకు 2,830 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ హవా ముందు ఇతర పార్టీలేవీ నిలబడలేకపోయాయి. పోలైన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కువగా వైసీపీకి రావడంతో వైసీపీ గెలుపొందింది. కాగా.. ఈ విషయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. దాసరి సుధ రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజారిటీని ఆమె క్రాస్ చేసింది. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఆమె 68,492 ఓట్ల మెజారిటీని సాధించారు.
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు టీడీపీ, జనసేన దూరంగా ఉన్నాయి. అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరుగగా.. నేడు ఓట్ల లెక్కింపును చేపట్టారు.