అమరావతి: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండా కాకినాడ జిల్లాలో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.
"మొంథా" తుఫానును దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థుల భద్రత, క్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 31 వరకు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్టు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఆదివారం ప్రకటించింది.
ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని బోర్డు శాఖ ఫీల్డ్ సిబ్బందిని ఆదేశించింది. "విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా చూసుకోవాలి. సంబంధిత జిల్లా కలెక్టర్లు సెలవు దినాలుగా ప్రకటించిన రోజుల్లో ఏ సంస్థ పనిచేయకూడదు" అని వారు తెలిపారు. ఈ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం తీవ్రంగా పరిగణించబడుతుందని బోర్డు హెచ్చరించింది.