మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: ఇవాళ స్కూళ్లకు సెలవు

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  4 Dec 2023 7:23 AM IST
Cyclone, Michoung effect, holiday, schools, APnews

మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: ఇవాళ స్కూళ్లకు సెలవు

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు నుండి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నందున ఆయా జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ ఆదేశించారు. మిగతా జిల్లాల్లో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. మరోవైపు మిచౌంగ్‌ తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర్లో తీరం దాటనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, పూరి గుడిసెలు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో 1977 నవంబర్‌ 19 నాటి ఉప్పెన దివిసీమ వాసులను వెంటాడుతోంది. అప్పట్లో వచ్చిన ఉప్పెన కారణంగా వేల మంది చనిపోయారు. దీంతో ఆ పీడకలను గుర్తు చేసుకుని భయపడుతుండగా, అంత తీవ్రత ఉండదని అధికారులు చెబుతున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో విజయవాడ మీదుగా నడిచే 142కుపైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా, పాండిచ్చేరి , కారైకల్ , యానాంలో విద్యా సంస్థలను మూసివేయవలసి వచ్చింది. తమిళనాడులో, రాబోయే తుఫాను దృష్ట్యా అనివార్య సందర్భాలలో ఇంటి నుండి పని చేయమని లేదా అవసరమైన సిబ్బందితో మాత్రమే పనిచేయమని తమ ఉద్యోగులను ఆదేశించాలని ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు, కార్యాలయాలను కోరింది.

చెన్నై అంతటా పలు చోట్ల వర్షపాతం ప్రారంభమైందని, మిచువాంగ్ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 5 వరకు తీవ్రత మరింత పెరుగుతుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులోని చెంగల్‌పేట్, కాంచీపురం, తిరువళ్లూరుతో సహా ఇతర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు మెట్రో స్టేషన్ల దగ్గర నీరు నిలిచిపోయింది. సెయింట్‌ థామస్‌ మెట్రో స్టేషన్‌లో 4 అడుగుల మేర నీరు చేరడంతో స్టేషన్‌లోకి ప్రవేశించే మార్గం నిలిచిపోయింది. ప్రయాణికులు ఆలందూరులో మెట్రో రైలు ఎక్కాలని సూచించారు.

Next Story