Heavy Rains : ఈ ఐదురోజులు జాగ్రత్త.. ఏపీ ప్రభుత్వం
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి
Heavy Rains : ఈ ఐదురోజులు జాగ్రత్త.. ఏపీ ప్రభుత్వం
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఈ ఐదురోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు, వరద విపత్తును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు.