నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుంది. ఈ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. 140కి పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. డిసెంబరు 3 నుంచి 6 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. రైళ్ల రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే మిచౌంగ్ గా పిలవనున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మైపాడు తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులు జలమయమవుతున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.