రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో రైతులకు సీఎం జగన్‌ తీపికబురు అందించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on  4 Dec 2023 9:27 AM IST
Cyclone effect, CM Jagan, grain collection, farmers, APnews

రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో రైతులకు సీఎం వైఎస్‌ జగన్‌ తీపికబురు అందించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేయాలని, ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పట్టించుకోవద్దని, ఏడు జిల్లాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని అధికారులకు సూచించారు. సదరు జిల్లాల్లో డ్రయర్లు లేకుంటే పొరుగు జిల్లాలకు పంపాలని, అందుకయ్యే రవాణా ఖర్చులనూ కూడా భరించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. తుఫాన్ ప్రభావంతో కొద్దిరోజులు ఆన్‌లైన్‌ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. కాగా నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్‌ సౌకర్యం గల మిల్లులు ఉన్నాయి. పౌర సరఫరాల సంస్థ మొదల రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని మార్కెట్‌ యార్డులు, గోడౌన్లు, అనుబంధ మిల్లుల్లో నిల్వ ఉంచనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్‌ దశల్లో ఉంది. రైతులెవరూ అధైర్యపడొద్దని.. వీలైనంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Next Story