ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీలు పెరగవ్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కంలు తీసుకున్నాయి.
By అంజి Published on 30 Jan 2024 7:47 AM ISTఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీలు పెరగవ్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కంలు తీసుకున్నాయి. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండ ఎస్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్‌లే కొనసాగించనున్నట్టు వెల్లడించాయి. రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్‌కు రూ.1, గ్రీన్ పవర్ కేటగిరీలో 75 పైసల నుంచి రూ.1కి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్సీని కోరాయి. వీటికి త్వరలో ఆమోదం లభించనుంది. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది.
మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేయనున్నారు. సోమవారం నాడు వైజాగ్‌లో ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి మొదటి రోజు 17 మంది అభిప్రాయాలు చెప్పారు.