చంద్రబాబు నాయుడుపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు
Criminal Case Filed Against Chandrababu. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసు నమోదైంది.
By Medi Samrat Published on 7 May 2021 5:31 PM ISTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టారు. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలులోని 1 టౌన్ లో కేసు నమోదు చేశారు. నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని అడ్వొకేట్ సుబ్బయ్య కేసు నమోదు చేశారు. ఐపీసీ 155, 505(1) b (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం లోని సెక్షన్ 4 కింద కూడా కేసు నమోదు చేశారు.
చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల కిందట అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని ట్వీట్లు చేశారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని.. కరోనాకు చెందిన ఇతర వైరస్‌ల కంటే కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు చెప్పినట్లుగా ఎన్ 440కె రకం వైరస్ ఆంధ్రప్రదేశ్ లో లేదని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు నాయుడు ప్రజలను భయాందోళలకు గురి చేస్తూ ఉన్నారని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుపై కర్నూలు జిల్లాలో క్రిమినల్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ అయింది.