ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. వైసీపీ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉండగా.. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు గురించి ప్రకటన వెలువడడమే ఆలస్యం అని అంటున్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం మాత్రమే పెండింగ్ ఉంది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టమని అన్నారు. బీజేపీ చెంతన చేరే విషయంలో ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యంగా మూడో సారి ఎన్డీయే అధికారంలోకి రాకుండా చూడాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని అన్నారు. దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అమరావతికి అన్ని రాజకీయపార్టీలు ఆమోదం తెలిపాయని.. అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానుల డ్రామా ఆడారన్నారు.ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారని విమర్శలు గుప్పించారు.కర్నూలు న్యాయ రాజధాని కోసం ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను జనం పంపించారు.. ఏపీలో జగన్ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.