పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ
CPI Narayana Comments On Alliances IN AP. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
By M.S.R Published on 23 Nov 2022 7:00 PM ISTఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఇష్టం ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన, వామపక్షపార్టీలు కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా ముందుకెళ్తేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని నారాయణ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన పవన్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. మోదీ, జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని.. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే మూడు పార్టీలు కలిసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని నారాయణ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని.. మోదీ ప్రభుత్వాన్ని జగన్ నిలదీయలేకపోతున్నారన్నారు. ప్రజలకు వందలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అన్నారు.
బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని అన్నారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని తెలిపారు. ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని, ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.