ఏపీలో కోవిడ్ మరణం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా యూకే దేశస్తుడు మరణించారు.
By Medi Samrat Published on 29 Dec 2023 8:00 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా యూకే దేశస్తుడు మరణించారు. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్య సాయి బాబా సమాధి దర్శనానికి వారం రోజుల క్రితం ప్రశాంతి నిలయానికి యూకే దేశస్తుడు భాస్కర్ జోషి పుట్టపర్తికి వచ్చారు. వారం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ జోషికి వైద్య పరీక్షలు నిర్వహించి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భాస్కర్ జోషి మృతి చెందారు. యూకే పౌరసత్వం కలిగి ఉండటంతో భాస్కర్ జోషి కుటుంబానికి సమాచారం అందించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మరో ఎనిమిది పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో నలుగురికి, తిరుపతిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయవాడ సమీపంలోని కానూరులో రెండు కేసులు, గన్నవరం, మచిలీపట్నంలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. తిరుపతిలోని రుయాస్పత్రిలో నిర్వహించిన కొవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పక్క రాష్ర్టాల్లో వెలుగుచూస్తున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయాస్పత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.