టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించి కోర్టు. వీరిద్దరిని కర్నూలు సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది.
నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత సుబ్బారెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయాన అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనపై సీనియర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు, సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.