వారిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఓప్పుకోలేదు. దీంతో ఆ ప్రేమ జంట మరణంతో ఒక్కటయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో ఈ విషాదం నెలకొంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరించడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలీ మండలం మాధవరం గ్రామానికి చెందిన భారతి, కంబగిరి రాముడుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. తమ బిడ్డల ఆత్మహత్య విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువతి, యువకుడు వరుసకు అన్నా, చెల్లెలు అవుతారని.. అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో భారతికి వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. రాముడుపై ఉన్న ప్రేమతో భర్తకు దూరంగా భారతి ఉంటోంది.