మార్చి 1న తిరుపతి వేదికగా హోదాపై డిక్లరేషన్: షర్మిల

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా కొననసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 11:08 AM GMT
congress, sharmila, comments,  bjp, ycp, tdp, andhra pradesh,

మార్చి 1న తిరుపతి వేదికగా హోదాపై డిక్లరేషన్: షర్మిల 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా కొననసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇక వైసీపీ కూడా సిద్ధం సభలతో ప్రచారంలో జోరుగా పాల్గొంటుంది. పొత్తులో భాగం చేసుకునేందుకు బీజేపీతో టీడీపీ, జనసేన చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల చురుగ్గా ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటు టీడీపీ, జనసేన.. అటు వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

మార్చి 1న తిరుపతిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తిరుపతి వేదికగా జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని చెప్పారు. అధికార పార్టీ వైసీపీ హోదాపై మాటలు మాత్రమే చెప్పిందని విమర్శించారు. తమకు అధికారం ఇచ్చిన.. ఎక్కువ సంఖ్యలో ఎంపీలను ఇస్తే కేంద్రంలో కీలక భూమిక పోషించి.. హెదాను సాధిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఇక పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ తిరుపతి సభలో మాట ఇచ్చి.. ఆయన కూడా దాన్ని విస్మరించారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడలేదని అన్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో అదే తిరుపతి వేదికగా హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామని వైఎస్ షర్మిల చెప్పారు.

ఏపీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని వైఎస్ షర్మిల అన్నారు. ఏపీని హార్డ్‌వేర్‌ హబ్‌గా మారుస్తామని మోదీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని అన్నారు. పదేళ్లుగా బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని షర్మిల చెప్పారు. రాష్ట్రానికి ఇన్నేళ్లలో కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదన్నారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్ నారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Next Story