హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి: పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By - Knakam Karthik |
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి: పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై ఎక్కడ దాడి జరిగినా కుల, మత, భాషా భేదాలు లేకుండా ముక్తకంఠంతో ఖండించాలని, లేకపోతే ఈ దాడుల పరంపర ఆగదని ఆయన పిలుపునిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత పాలకులు పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్.డి.డి.బి. (NDDB) రిపోర్టు స్పష్టం చేసిందని, అసలు ఆ నెయ్యిలో పాల ప్రమేయమే లేదని సిట్ (SIT) విచారణలో తేలిందని పవన్ పేర్కొన్నారు.
అరాచకాల్లోనూ 'నూతన ఆవిష్కరణలు' చేసిన ఘనత గత పాలకులదని, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరమని ఆయన ధ్వజమెత్తారు. గత టీటీడీ బోర్డు సభ్యులు, వారిని వెనకేసుకొస్తున్న వారే ఈ మహా పాపానికి బాధ్యులని.. భగవంతుడి సొమ్ము దోచుకున్న వారి తరాలు నాశనమవుతాయని హెచ్చరించారు. కలియుగ దైవానికి జరిగిన ఈ అపచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడి తీరాలని పవన్ కల్యాణ్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.
‘భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్ష పడాలి. ఈ కేసులో దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే, సీబీఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేల్చినట్టు చెప్పారు.
పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి... ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనన్నారు. అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందనీ, పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని చెప్పారు. జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాష, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించకపోతే ఇలాంటి పరంపరలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.