అమరావతి: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. రేపటి నుంచి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్టు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మునిగిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లోని వారికి రూ.10 వేల చొప్పున సాయం అందించనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వనున్నారు.
అలాగే పంట దెబ్బ తిన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగింది. భారీ వరదలు చాలా మంది సర్వం కోల్పోయారు. ఈ క్రమంలోనే వారికి ప్రభుత్వం సాయం ప్రకటించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ గైడ్‌లైన్స్ ప్రకారం ఇవ్వాల్సిన దానికంటే అదనంగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో ఇచ్చింది. అదనపు ఆర్థిక సాయం కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుతూ ఏపీ రెవెన్యూ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.