అమరావతి: రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్‌షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. నిన్నటి నుంచి కాకినాడు, ఏలూరు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. సెప్టెంబర్ 15 నాటికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.
ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలోని సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. గుంటూరు జిల్లాలో 5.85 లక్షల మందికి, ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే 83 వేల మందికి ఈ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయన్నారు. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని మంత్రి నాదెండ్ల తెలిపారు.