మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లోనే.. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే: సీఎం జగన్‌

57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి దగ్గరే అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.

By అంజి  Published on  3 May 2024 5:18 PM IST
CM YS Jagan , Kanigiri, election campaign, APPolls

మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లోనే.. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే: సీఎం జగన్‌

57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి దగ్గరే అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కనిగిరి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. వాలంటీర్లు పెన్సణ్లు పంపిణీ చేయొద్దని తన మనిషి నిమ్మగడ్డతో చంద్రబాబే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని సీఎం జగన్‌ ఆరోపించారు. కడుపు మంట చల్లారక వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారని, తాము అధికారంలోకి రాగానే ఇంటి వద్ద నుంచే పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

అంతకుముందు నరసాపురంలో రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం జగన్‌.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్‌ వార్‌ అని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి అని అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్టేనని అన్నారు.

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాలన్నారు. పేదవాడి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాలని, 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని అన్నారు. మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలని, చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలన్నారు. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి అని సీఎం జగన్‌ కామెంట్స్‌ చేశారు.

Next Story